38 ఇళ్లు దగ్ధం – గిరిజన కుటుంబాలు నిరాశ్రయులు
కాకినాడ పరిధిలోని సర్లంకపల్లెలో సోమవారం అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మొత్తం 38 ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. ప్రధానంగా గిరిజన కుటుంబాలకు చెందిన గుడిసెలు మంటల్లో చిక్కుకున్నాయి.
ప్రాథమిక సమాచారం ప్రకారం, వంట సమయంలో గ్యాస్ సిలిండర్ పేలుడు కారణంగానే ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో గ్రామమంతా భయాందోళనకు గురైంది. కుటుంబ సభ్యులు ప్రాణాలు కాపాడుకోవడానికి బయటకు పరుగులు తీశారు.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగకపోవడం ఊరట కలిగించే విషయం. అయితే బాధిత కుటుంబాలు సర్వస్వం కోల్పోయి ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
అగ్నిప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలపై అధికారులు విచారణ చేపట్టారు. బాధితులకు తక్షణ సహాయం అందించాలంటూ స్థానికులు కోరుతున్నారు.ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఒక్కసారిగా చోటుచేసుకున్న ఈ ఘటనతో ఆ ప్రాంతం శ్మశానాన్ని తలపించింది