స్థానికంగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం. భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండలం ఇరుసుమండలో గల ONGC పైప్లైన్ నుంచి అకస్మాత్తుగా గ్యాస్ లీక్ కావడంతో భారీ మంటలు ఎగసిపడ్డాయి. లీకైన గ్యాస్ గాలిలోకి వేగంగా ఎగజిమ్మడంతో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
మంటలు చెలరేగిన దృశ్యాన్ని చూసిన గ్రామస్థులు ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చి పరుగులు తీశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వెంటనే అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న మలికిపురం మండల తహశీల్దార్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.
గ్యాస్ లీక్ అవుతున్న ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం తక్షణమే ఓఎన్జీసీ అధికారులకు సమాచారం ఇవ్వగా, అక్కడికి చేరుకున్న ఓఎన్జీసీ టెక్నికల్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చే పనిని ప్రారంభించారు. ప్రస్తుతం పరిస్థితిని పూర్తిగా నియంత్రణలోకి తెచ్చేందుకు చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.