అత్యాధునిక సౌకర్యాలతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం – రాష్ట్ర అభివృద్ధికి కొత్త ఊపు
ఆంధ్రప్రదేశ్‌లో విమానయాన రంగానికి కొత్త దిశ చూపించే ప్రాజెక్ట్‌గా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వేగంగా రూపుదిద్దుకుంటోంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మాణంలో ఉన్న ఈ విమానాశ్రయం అత్యాధునిక సాంకేతికతతో, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా అభివృద్ధి చెందుతున్నట్లు అధికారులు తెలిపారు.
డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్, సీఈఓ రణబీర్ సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో, విమానాశ్రయ నిర్మాణ పనులు సర్వాంగ సుందరంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా టెర్మినల్, రన్‌వే, భద్రతా వ్యవస్థలు సిద్ధమవుతున్నాయని పేర్కొన్నారు.
ఈ విమానాశ్రయం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఆర్థికంగా, వాణిజ్యంగా భారీ లాభం చేకూరుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు. ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు, రాష్ట్ర అభివృద్ధికి ఇది కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు.