ఆలయం అభివృద్ధి పనుల శంకుస్థాపన అనంతరం జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు, శ్రేణులతో పవన్ సమావేశం కానున్నారు.
అమరావతి, జనవరి 2:
తెలంగాణలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రం అభివృద్ధికి కీలక ముందడుగు పడింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు (శనివారం) కొండగట్టుకు వెళ్లనున్నారు.
ఈ ఆలయ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు సహకారం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో తిరుమల తిరుపతి దేవస్థానాలు నిధులు మంజూరు చేసింది. టీటీడీ నుంచి రూ.35.19 కోట్లతో భక్తుల సౌకర్యార్థం సత్రం, దీక్షా విరమణ మండపం వంటి నిర్మాణాలను చేపట్టనున్నారు.
ఈ పనులకు రేపు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. శనివారం ఉదయం 10:30 నుంచి 11:30 గంటల వరకు ఆయన **కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం**లో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు.
ఈ ప్రాజెక్ట్‌తో కొండగట్టు క్షేత్రానికి వచ్చే భక్తులకు మరింత మెరుగైన వసతులు అందనున్నాయని అధికారులు తెలిపారు.ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం గతంలోనే పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆ సమయంలో ఆలయంలో చేపట్టాల్సిన నిర్మాణాలపై అర్చకులు పవన్‌కు వివరించారు. తదనంతరం కొండగట్టు క్షేత్ర అభివృద్ధిపై పవన్, సీఎం **చంద్రబాబు నాయుడు**తో సమావేశమై, తిరుమల తిరుపతి దేవస్థానాలు సహకారంతో నిర్మాణాలు చేపట్టాలని కోరారు.
సీఎం చంద్రబాబు ఆదేశాలతో పవన్ టీటీడీ చైర్మన్‌తో చర్చలు జరపగా, రూ.35.19 కోట్ల నిధుల మంజూరుకు టీటీడీ బోర్డు అంగీకారం తెలిపింది. ఈ నిధులతో **కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం**లో దీక్ష విరమణ మండపం, 96 గదుల సత్రం నిర్మించనున్నారు. ఒకేసారి సుమారు 2 వేల మంది భక్తులు దీక్షలు విరమించేలా విస్తృతంగా మండపాన్ని రూపొందించనున్నారు.
శనివారం జరిగే శంకుస్థాపన కార్యక్రమంలో పవన్‌తో పాటు టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు, ఎమ్మెల్సీ హరిప్రసాద్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, టీటీడీ బోర్డు సభ్యులు బి. ఆనందసాయి తదితర నేతలు పాల్గొననున్నారు.
ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన అనంతరం, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు, శ్రేణులతో సమావేశం కానున్నారు. అలాగే ఇటీవల జరిగిన తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుతో విజయం సాధించిన వారితో భేటీ అవనున్నారు. ఈ సమావేశాలు కొడిమ్యాల సమీపంలోని బృందావనం రిసార్టులో జరగనున్నాయి.