వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీ మంత్రి నారాయణ అమరావతి అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ పాలనలో రాజధానిపై సరైన శ్రద్ధ చూపలేదని, ముఖ్యంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో అమరావతి పనులు నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆయన విమర్శించారు.
శుక్రవారం నేలపాడు గ్రామంలో పర్యటించిన మంత్రి, రాజధాని పరిధిలోని గ్రామాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు గ్రామ సభల్లో పాల్గొన్నారు. ఈ సమావేశాల్లో ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 2019లో రాజధాని నిర్మాణానికి భారీ స్థాయిలో టెండర్లు పిలిచామని, అందులో భాగంగా వేల కోట్ల రూపాయల పనులు ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపారు. అయితే మధ్యలో పాలన మార్పుతో కాంట్రాక్టర్లకు చెల్లింపులు నిలిచిపోవడంతో పనులు మందగించాయని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ టెండర్ల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లినట్టు వివరించారు.
వర్షాల కారణంగా కొంతకాలం పనులు నిలిచినా, ప్రస్తుతం అమరావతిలో అభివృద్ధి పనులు మళ్లీ ఊపందుకున్నాయని మంత్రి స్పష్టం చేశారు. గ్రామాల రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి వసతులు వంటి మౌలిక సదుపాయాలను దీర్ఘకాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్నామని తెలిపారు. 2058 నాటికి జనాభా పెరుగుదలను అంచనా వేసి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.
కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కరించడానికి కొంత సమయం పట్టిందని అంగీకరించిన మంత్రి నారాయణ, మరో రెండు నెలల్లో మళ్లీ గ్రామాలను సందర్శించి పురోగతిని సమీక్షిస్తామని వెల్లడించారు.